Blog

Latest News
రచయిత డాక్టర్ రాపోలు సుదర్శన్

రచయిత డాక్టర్ రాపోలు సుదర్శన్

 

“కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి” అనే అబ్దుల్ కలామ్ సూక్తి ప్రత్యక్ష నిదర్శనం డాక్టర్ రాపోలు సుదర్శన్. 10వ తరగతి తప్పి ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో లిప్ట్బయ్ గా జీవితం ప్రారంభించిన సుదర్శన్ అదే సంస్థలో అంచెలంచెలుగా ఎదిగి అసిస్టెంట్ జనరల్ మేనేజరుగా పనిచేస్తూ పదవి విరమణ చేయడం ఆయన నిరంతర శ్రమకు ఉదా హరణ. హైదరాబాద్లోని నింబోలిగడ్డకు చెందిన రాపోలు యాదగిరి, శ్రీమతి నీలమ్మ దంపతులకు 1958, మార్చి 3వ తేదీన హైదరాబాద్లో జన్మించిన సుదర్శన్ 10వ తరగతి తర్వాత ఐటిఐ చదివారు. (ఈ ట్రేడ్ సర్టిఫికెట్ ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉద్యోగం లభించింది).ఆ తర్వాత తెలుగు భాష పట్ల వున్న ఆసక్తితో ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాలలో తెలుగు భాషలో డిప్లమా, ఆ తర్వాత డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. ఒకవైపు ఉద్యోగ పరంగా అవసరమైన పోటీ పరీక్షలు ఉత్తీర్ణులవుతూ అసిస్టెంట్ జనరల్ స్థాయికి ఎదిగారు. మరో వైపు స్వయంకృషితో తెలుగు ప్రధాన అంశంగా పోస్టుగ్రాడ్యుయేషన్ తర్వాత శ్రీశ్రీ పీఠికలపై ఎం.ఫిల్., శ్రీశ్రీ వచన రచనలపై పి. హెచ్ఎ పూర్తి చేశారు.

ఉద్యోగం చేస్తూనే హైదరాబాద్ నగరంలో సంఘీయులకు సేవలందించడంలో తనదైన ముద్రవేసుకొన్నారు. సంఘ సీనియర్ నాయకులతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సంఘీయుల సమస్యలను తెలుసుకొన్నారు. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ నాయీబ్రాహ్మణ విద్యార్ధి సంఘం ఏర్పాటు చేయడంలో తన వంతు సహకారాన్ని అందించారు. నేటికి హైదరాబాద్లో జరిగే అనేక సంఘ కార్యక్రమాలలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సంఘీయులను   చైతన్య పర్చడంలో భాగంలో కొన్ని సంవత్సరాలు “ఉపాలి” అనే త్రైమాస పత్రికను నిర్వహించారు.

అరసం ప్రధాన కార్యదర్శిగా: సంఘ కార్యక్రమాలలోనే కాకుండా హైదరాబాద్ నగరంలో జరిగే సాహిత్య కార్యక్రమాలలో ముఖ్యభూమిక పోషిస్తున్నారు. వందల సంఖ్యలో కవితలు, వ్యాసాలు రాశారు. శ్రీశ్రీ పీఠికల-ఒక పరిశీలన, శ్రీశ్రీ వచనా విన్యాసం అనే పరిశోధనా గ్రంథాలతోపాటు సంప్రోక్షణ పేరుతో ఒక గ్రంథాన్ని వెలువరించారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అనేక సాహిత్య కార్యక్రమాలకు అధ్యక్షునిగా వ్యవహరించడమే కాకుండా అనేక గ్రంథాలను రచించారు. వీరి సభా నిర్వహణ అద్భుతంగా వుంటుంది. సాహితీవేత్త, రచయితగా అనేక పురస్కారాలు, సన్మానాలు పొందారు.

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *